ఏపీ అప్ డేట్స్..📖
4K Posts • 2M views
P.Venkateswara Rao
3K views 15 hours ago
#ఏపీ అప్ డేట్స్..📖 #🏛️రాజకీయాలు *ఆంధ్రా చెవిలో లులు పువ్వు.. ఈ డీల్ చూస్తే❗* OCTOBER 20, 2025🎯 ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చెవిలో రాష్ట్ర ప్రభుత్వం, లులు గ్రూప్ పెద్ద పువ్వు పెట్టాయి. గుజరాత్లో తాజాగా ఆ మల్టీ నేషనల్ కంపెనీ భూమి కొనుగోలు డీల్ .. ఏపీ ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగిందనే వాస్తవాన్ని బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో కొన్నేళ్లుగా లులు గ్రూప్ కేంద్రంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు సర్కార్కు అత్యంత ఇష్టమైన కంపెనీగా లులు గుర్తింపు పొందింది. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, ఆ కంపెనీకి విజయవాడ, విశాఖలలో అప్పనంగా భూసంతర్పణంగా జరిగింది. ఇదే కంపెనీ గుజరాత్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి తాజాగా ముందుకొచ్చింది. ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత పదేళ్లకు పైగా దేశ ప్రధానిగా సేవలందిస్తున్నారు. ఏపీలో మాదిరిగా గుజరాత్లో లులు గ్రూప్నకు ప్రభుత్వ భూమిని కారుచౌకగా కట్టబెట్టకపోవడం విశేషం. అహ్మదాబాద్ చరిత్రలో లులు కంపెనీ భూవిక్రయాన్ని అతిపెద్ద డీల్ ఆ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వర్గాలు ప్రకటించడం విశేషం. చంద్ఖేడాలో 66, 168 చదరపు మీటర్ల భూమిని లులు ఇంటర్నేషన్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.519.41 కోట్లకు కొనుగోలు చేసి ఆల్టైమ్ రికార్డ్ రియల్టర్లు గర్వంగా ప్రకటించారు. సబర్మతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. స్టాంప్ డ్యూటీ కింద గుజరాత్ ప్రభుత్వానికి రూ.31 కోట్ల ఆదాయం సమకూరింది. అహ్మదాబాద్ నగర చరిత్రలో ఇదో రికార్డ్. ఇదే లులు గ్రూప్నకు కూటమి సర్కార్ ఎలా సాగిలపడిందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు, అలాగే ఉద్యోగాల పేరుతో ప్రజల్ని ఏ రకంగా మోసగిస్తున్నారో, గుజరాత్ డీల్ చెప్పకనే చెబుతోంది. ఈ లులు గ్రూప్నకు విజయవాడ, విశాఖలో విలువైన భూముల్ని ప్రభుత్వం కట్టబెట్టింది. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా, ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ప్రశ్నించే వాళ్లందర్నీ రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది, జరుగుతోంది కూడా. అబుదాబీ కేంద్రంగా ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ లులు గ్రూప్ నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి విశాఖలో వాల్తేరు హార్బర్ పార్కు వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా అత్యంత ఖరీదైన 13.74 ఎకరాలను 99 సంవత్సరాలకు లీజ్కు ఇస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ జూలైలో ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడ 13.5 లక్షల చదరపు అడుగుల్లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నారు. చదరపు అడుగుకు నెలకు కేవలం రూ.1.50 చొప్పున వసూలు చేస్తారు. ఏడాదికి రూ.4.51 కోట్లు ప్రభుత్వానికి లులు అద్దె చెల్లిస్తుంది. మొదటి మూడేళ్లు ఎలాంటి లీజు వుండదు. నిర్మాణం పూర్తయ్యాకే లీజు వసూలు చేయాలనే నిబంధన విధించడం ఇక్కడి ప్రత్యేకత. విశాఖలో చదరపు అడుగుకు రూ.40-50 వరకు అద్దె ధర పలుకుతోంది. అలాగే ప్రతి పదేళ్లకు కేవలం పది శాతం అద్దె ధర పెంచాలని నిర్ణయించడం గమనార్హం. అయితే విశాఖలో రూ.680 కోట్ల విలువైన ఈ స్థలాన్ని లులు గ్రూప్నకు ఇవ్వడాన్ని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ ఈ ప్రభుత్వం అప్పనంగా కట్టబెడుతోంది. గత ప్రభుత్వం విలువైన భూమిని రద్దు చేసి, వీఎంఆర్డీఏకు అప్పగించింది. అయితే కూటమి ప్రభుత్వం రాగానే వీఎంఆర్డీఏ నుంచి నుంచి భూమి తీసుకుని ఏపీఐఐసీకి అప్పగించింది. ఆ భూమినే లులుకు కట్టబెట్టింది. గుజరాత్లో 66,168 చదరపు మీటర్ల భూమిని రూ.519.41 కోట్లతో కొనుగోలు చేసి వ్యాపారాన్ని ప్రారంభించడానికి సిద్దమవడాన్ని గమనించొచ్చు. కానీ ఏపీకి వచ్చే సరికి అంతకు రెండింతల స్థలాన్ని అత్యంత కారు చౌకగా, దాదాపు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కొట్టేయడం వెనుక చిదంబర రహస్యమేంటో పాలకులకే తెలియాలి. విజయవాడలో లులు కంపెనీ కథేంటో తెలుసకుందాం. విజయవాడ నడిబొడ్డున గవర్నర్పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని లులు చేతిలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టింది. ఆ కంపెనీ అక్కడ కేవలం రూ.156 కోట్ల పెట్టుబడి మాత్రమే పెట్టనుంది. కానీ లులుకు అప్పగించే భూమి విలువ రూ.600 కోట్లకు పైమాటే. ఇటు విజయవాడ, అటు విశాఖపట్నంలోనూ లులుకు 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఈ కంపెనీకి రెండు ప్రధాన నగరాల్లో అత్యంత విలువైన భూమి కట్టబెట్టడంపై ప్రతిపక్షాలు, పౌరులు, ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా, పాలకులు ఖాతరు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యాయస్థానాల్లో లులు గ్రూప్నకు భూకేటాయింపులను వ్యతిరేకంగా పిటిషన్లు. గుజరాత్లో ఇదే లులు కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం భూము కొనుగోలు చేయించడంతో పాటు స్టాంప్ డ్యూటీ కింద కోట్లాది రూపాయిలు అదాయం పొందింది. లులు కంపెనీ ఉచితంగా సేవలందించే ఎన్జీఓ సంస్థ కాదు. ఈ విషయం తెలిసి కూడా వందల కోట్ల భూమిని అప్పనంగా కట్టబెట్టడం వెనుక భారీగా చేతులు మారిందనే అనుమానాల్ని ఎవరు తీర్చాలి? పాలకులు అడ్డగోలుగా ముందుకెళితే ప్రజలు నమ్మే పరిస్థితే వుంటుంది కదా? మరీ ముఖ్యంగా ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన పాలకులే, విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. లులు కంపెనీ రెండు చోట్లా పెట్టే పెట్టుబడి ఎంత? మన యువతకు వచ్చే ఉద్యోగాలెన్ని? అవి ఎలాంటివి? జీతభత్యాలెంత? అంతిమంగా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏంటి? తదితర ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మరోవైపు గుజరాత్ డీల్ చూసిన వారెవరికైనా... ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చెవిలో పెద్ద పువ్వు పెట్టారనే నిజం బయటపడింది. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని గతంలో ఇదే చంద్రబాబు పాలనలో వామపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాలి. అదే పరిపాలన ఇప్పుడూ కొనసాగుతుండడం ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. చివరికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములనేవి మిగలవనే భయం కూడా వెంటాడుతోంది.
30 likes
19 shares
P.Venkateswara Rao
624 views 1 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 *ఉద్యొగులకు డిఏ.. నాయకులకు ఒకే..❗* OCTOBER 19, 2025🎯 ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల చర్చలు, ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో భేటీ నాటకీయంగా సాగాయి. నాలుగు డీఏలు రావాల్సి వుండగా, ఒక్కదానితో సీఎం చంద్రబాబు సరిపెట్టారు. బాబును కలిసి ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం వెరీవెరీ హ్యాపీ. అయితే ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించినంత సంతోషం, ఉద్యోగుల్లో కనిపించడం లేదు. ఒక్క డీఏ ప్రకటనతో ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. పీఆర్సీ, ఇంటీరియం రిలీఫ్ (ఐఆర్), వేల కోట్ల బకాయిలు తదితర కీలక అంశాలపై ఎలాంటి ముందడుగు పడకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి అట్లే వుంది. మరీ ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ వేసే విషయంలో ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకురావడంతో ఉద్యోగులు నిరుత్సాహానికి గురయ్యారు. పీఆర్సీ ఆలస్యం అవుతుండడంతో ఐఆర్ ఇస్తారని ఉద్యోగులు ఆశించారు. అయితే ఆ ఊసు కూడా లేదు. ఉద్యోగులకు రావాల్సిన రూ.31 వేల కోట్ల బకాయిల విషయంలో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. తమ సమస్యల విషయంలో నాడు జగన్ సర్కార్, నేడు చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరుకు పెద్ద తేడా లేదని ఉద్యోగులు వాపోతున్నారు. అయితే ఉద్యోగులతో వైసీపీ హయాంలో మొరటుగా వ్యవహరించి, తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం తెలివిగా వ్యవహరించి, వ్యతిరేకత లేకుండా చూసుకుంటున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. కేవలం పిలిచి మాట్లాడ్డమే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన అతిపెద్ద గౌరవమన్నట్టు సంఘాల నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శ కూడా వారి నుంచి లేకపోలేదు. వైసీపీ అనుకూల ఉద్యోగ సంఘాల నాయకులకు తాజాగా ప్రభుత్వం దగా చేసినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు అనుకూల ఉద్యోగ సంఘాల నాయకులకు మాత్రం... దీపావళి వెలుగు నింపినట్టుగా వుండడం విశేషం. ఇక్కడే కీలక విషయాన్ని గమనించాలి. ఉద్యోగులకు ఏమీ ఇవ్వకపోయినా, ఉద్యోగ సంఘాల నాయకులకు పోయేదేమీ లేదు. ప్రభుత్వ పెద్దలతో సంబంధాలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే విమర్శను కొట్టి పారేయలేం. అందుకే కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు మోతాదుకు మించి లౌక్యం ప్రదర్శించడాన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. టీవీలు, యూట్యూబ్ చానెల్స్లో కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం తమకు ఏమీ చేయడం లేదని విమర్శిస్తూనే, మరోవైపు సీఎం చంద్రబాబును ప్రశంసించడాన్ని ఉద్యోగులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇవన్నీ సొంత పనుల్ని చక్కబెట్టుకోడానికే తప్ప, తమను ఉద్ధరించడానికి కాదని ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం జరిపి, కేవలం డీఏతో సరిపెట్టడం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పట్లో ఏమీ చేయరని, తాజా డీఏ ప్రకటనతో స్పష్టమైందని ఉద్యోగులు వాపోతున్నారు. పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ బకాయిలు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ లాంటివన్నీ కోల్డోస్టోరేజీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇదంతా చూస్తుంటే, ఉద్యోగ సంఘాల నాయకులు -ప్రభుత్వం మధ్య ఒక అవగాహనతో జరిగినట్టు కనిపిస్తోందనే అనుమానం ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. గతంలో సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులతో ఏనాడూ చర్చలు జరపలేదని, మీరు మాట్లాడితే చాలు, దాన్ని పెద్ద ఎత్తున పాజిటివ్ కోణంలో ప్రచారం చేస్తామని కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు అవగాహన కుదుర్చుకున్నట్టు ఉద్యోగులు అనుమానిస్తున్నారు. రాజకీయాలకు, ప్రలోభాలకు అతీతులెవరూ లేరు. ఏది ఏమైతేనేం... 16 నెలలుగా పెట్టకున్న ఆశలపై ఒక్క డీఏతో నీళ్లు చల్లారన్న విమర్శ ఉద్యోగుల నుంచి రావడాన్ని పాలకులు విస్మరించడానికి లేదు.
10 likes
8 shares
P.Venkateswara Rao
560 views 1 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #ఎల్లో మీడియా.. 💥 *చంద్రబాబు-ఆర్థిక వాస్తవాలు❗* OCTOBER 19, 2025🎯 సాధారణంగా మధ్య తరగతి ఇళ్లలో ఒక కామన్ సీన్ వుంటుంది. ఇంటి ఇల్లాలు పండగకు పట్టుచీర కొనమంటే మగడు ఇంటి ఖర్చులు, అప్పులు అన్నీ గుర్తుకు తెచ్చుకుని పెడతాడు. ఆంధ్ర సిఎమ్ చంద్రబాబు రాష్ట్ర ఉద్యోగులుతో మాట్లాడిన మాటలు ఇదే వైనం గుర్తుకు తెచ్చాయి. ఈ రోజు తెలుగుదేశం అనుకూల పత్రికల్లో పతాక శీర్షికల్లో వేసిన వార్త చూస్తే, ఒక్కో ప్రభుత్వం ఉద్యోగికి వేలకు వేలు జీతం పెరిగిపోయినంత హడావుడి. వాళ్లు సమస్యలు అన్నీ గాలికి ఎగిరిపోయినంత రేంజ్ వార్త. సాధారణంగా ప్రభుత్వం ఓ విడత డిఏ ఇస్తే వందల్లో జీతం పెరుగుతుంది. గతంలో ఇలాంటి వార్తను చిన్న సింగిల్ కాలమ్ లో వేసేవారు. కానీ ఈ రోజు ఒక డిఎ ఇచ్చిన వార్త పతాక శీర్షికలకు ఎక్కింది. ఎందుకంటే అయిదేళ్ల వైకాపా పాలనలో ఉద్యోగుల సమస్యలను భూతద్దంలో చూపించారు. చాలా మంది ఉద్యోగులు తమకు అన్యాయం జరిగిపోతోందన్న హడావుడి చేసారు. అయిదేళ్ల పాలన తరువాత ఒక్క నెల జీతం బకాయి లేదు. కానీ అసలు తమకు జీతాలే అందలేన్నంత హడావుడి జరిగిపోయింది. అంటెడెన్స్, ఫేస్ రికగ్నెజేషన్ ఇలాంటివి అన్నీ వాళ్లకు ఇబ్బంది కలిగించి, నానా యాగీ చేసారు. జగన్ (ప్రభుత్వం కాదు) ఉద్యోగులు దాచుకున్న డబ్బులు అన్నీ తినేస్తున్నాడు అనే ప్రచారం 'దేశం' అనుకూల మాధ్యమాలు సాగించాయి. ఉద్యోగులు యాంటీ వైకాపా స్టాండ్ తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తమ సమస్యలు అన్ని గాలికి ఎగిరిపోతాయి అనుకున్నారు. జీతం ఒకటో తేదీన ఇస్తున్నారు. ఫింఛన్లు ఒకటే తేదికి ఇస్తున్నారు అదే గొప్ప వరం అని మళ్లీ తెలుగుదేశం అనుకూల మాధ్యమాలు ఊదరగొట్టాయి. ఏడాదిన్నర పాటు ఓపిగ్గా వేచి వున్న ఉద్యోగులు మెల్లగా రొడ్డెక్కడం ప్రారంభించారు. దాంతో ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయింది. అలా చేసింది ఏమిటంటే ఒక డిఎ ఇవ్వడం. ఇంకా అయిదు డిఎ లు పెండింగ్ లో వున్నాయి. వీటిలో సగం వైకాపా ప్రభుత్వం పెండింగ్ లో వుంచినవి. మిగిలిన సగం గత ఏడాదిన్నరలో పేరుకున్నవి. దానికే మొత్తం బ్రహ్మాండం బద్దలైపోయినంత హడావుడి. సరే ఆ సంగతి అలా వుంచితే ఈ ఒక్క డిఎ ఇవ్వడం కోసం సిఎమ్ చంద్రబాబు ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వింటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్ధం అవుతోంది. ఆఫ్ కోర్స్ దానికి కారణం వైకాపా అని అనేయడం బై డీఫాల్ట్ కామన్ అనుకోండి. మరో అయిదేళ్లు దాటినా తప్పిదాలన్నింటికీ వైకాపా నే అంటూ ముందుకు సాగడమే కూటమి విధానం కావచ్చు. ఇంతకీ చంద్రబాబు చెప్పిన మాటలు ఏమిటంటే.. పే రివిజన్ గురించి నాకు వదిలి పెట్టండి ఆర్థికంగా వెసులుబాటు వస్తే పిఆర్సీ ఇవ్వడం పెద్ద కష్టం కాదు…… (ఇంతకీ ఈ రాష్ట్రానికి కాదు ఏ రాష్ట్రానికైనా ఆర్థికంగా వెసులుబాటు ఎప్పటికి వస్తుంది) మిగిలిన రాష్ట్రాలన్నీ మూలధన వ్యయం చేసి, అభివృద్ధి సాధిస్తుంటే, మనం మాత్రం ఎస్టాబ్లిష్ మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. నగదు బదిలీ పథకాలు అంటూ పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నాం. 2023-24 లో 93 శాతం ఎస్టాబ్లిష్ ఖర్చు వుంటే 2025=26 నాటికి 99.5 శాతానికి చేరింది. (అంటే మరి చంద్రబాబు అనుభవం వర్కవుట్ కాలేదని అనుకోవాలా) దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలు ఎస్టాబ్లిష్ ఖర్చులను సగానికి సగం తగ్గించుకున్నాయి. కేవలం ఆంధ్ర మాత్రమే తగ్గించుకోలేకపోతోంది. నూరుశాతానికి చేరిపోయింది. ఇలా చంద్రబాబు చాలా చెప్పుకువచ్చారు. దీని సారాంశం ఏమిటంటే .. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. వచ్చిన డబ్బులన్నీ ప్రభుత్వ నిర్వహణకే పోతోంది. మీకు నేను ఏమీ చేయలేను.. అని నెమ్మదిగా నచ్చ చెప్పడం అనుకోవాలి.
10 likes
9 shares
P.Venkateswara Rao
570 views 5 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #ఎల్లో మీడియా.. 🤠 *ఈ ప్రభుత్వ శాఖ తరఫున ఆంధ్రజ్యోతికి భారీ అభిమాన ప్రకటన…‼️* October 15, 2025🔥 ఉంటాయి ఉంటాయి… ఎందుకు ఉండవు..? ప్రధాన ఆదాయ ప్రభుత్వ శాఖలకు అభిమాన పత్రికలు కూడా ఉంటాయి… సందర్భం వచ్చినప్పుడు వాణిజ్య ప్రకటనలు ఇచ్చి, అడిగినంత టారిఫ్ చెల్లించి మరీ తమ అభిమానాన్ని చాటుకుంటాయి… అవును, ఇదేమిటిలా అని నొసలు విరవనక్కర్లేదు… ఆంధ్రప్రదేశ్‌లో అదంతే… ఎవరో ఆదేశిస్తారు, ఎవరో ఏదో ప్రభుత్వ శాఖ నుంచి యాడ్ వస్తుంది… పబ్లిష్ చేస్తారు… అంతా మాయ… అసలు ఒక ప్రభుత్వ శాఖ ‘అభిమాన పత్రిక’గా ప్రస్తావిస్తూ యాడ్ ఇవ్వడం అనైతికమే కాదు… అవాంఛనీయం కూడా… అసలు ఈ రోజుల్లో నిష్పక్షపాత పత్రిక అంటూ ఉంటేగా.., ఏదో ఓ పార్టీకి సొంతమో, కొమ్ముకాసేవో… తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది కదా ఇప్పుడు… ఇంకేం..? ప్రభుత్వ శాఖలన్నింటికీ ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ఎట్సెట్రా మీడియా హౌజులన్నీ అభిమాన మీడియా సంస్థలే అయిపోయాయి… 16 ఏళ్ల ఏబీఎన్ పాఠకులపై చెరగని ముద్ర అంటూ సాక్షాత్తూ చంద్రబాబూ ట్వీట్ శుభాకాంక్షలు చెబుతాడు… 23 ఏళ్ల అభిమాన ఆంధ్రజ్యోతి అని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కూడా తన అభిమానాన్ని ఓ యాడ్ ఇచ్చి ప్రకటించుకుంది… ఇవన్నీ సరే… మరీ దరిద్రంగా కనిపిస్తున్నది ఏమిటంటే… ఈ యాడ్ విజయవాడ తూర్పు జోన్ పేజీలో కనిపించింది… ఆ ఇచ్చేదేదో మెయిన్ పేజీలో వేయొచ్చుగా… పైగా అందులో ఆంధ్రజ్యోతి బాస్ రాధాకృష్ణ ఫోటో ప్రముఖంగా, ఓ పావు పేజీ పరిచేసి… ఫాఫం, చంద్రబాబు బొమ్మను, ఆ శాఖ మంత్రి అనగాని బొమ్మను కనీకనిపించని స్టాంపు సైజులో ‘ఏదో మొహమాటానికి’ అన్నట్టు పబ్లిష్ చేశారు… అన్నింటికన్నా చిత్రంగా కాస్త భూమిలో చతురస్రాకారపు బిట్ కత్తిరించి, దానిపై మ్యాప్స్ తరహాలో దాన్ని పిన్ చేయడం… మిగతా ఏదేదో మ్యాటర్, ఆ శాఖ సేవలు ఇంగ్లిషులో… వివిధ సందర్భాల్లో ఆయా పత్రికలు ప్రభుత్వ శాఖల నుంచి యాడ్స్ తీసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నదే… కానీ మరీ ఇంత భారీ అభిమానాన్ని చాటుకోవడం బహుశా ఇదే మొదటిసారేమో..!! పోనీ, ఇదేదో సమాచార శాఖ నుంచి ఇచ్చినా కాస్త బాగుండేదేమో..!!
12 likes
10 shares