#ఏపీ అప్ డేట్స్..📖 #ఎల్లో మీడియా.. 💥
*చంద్రబాబు-ఆర్థిక వాస్తవాలు❗*
OCTOBER 19, 2025🎯
సాధారణంగా మధ్య తరగతి ఇళ్లలో ఒక కామన్ సీన్ వుంటుంది. ఇంటి ఇల్లాలు పండగకు పట్టుచీర కొనమంటే మగడు ఇంటి ఖర్చులు, అప్పులు అన్నీ గుర్తుకు తెచ్చుకుని పెడతాడు. ఆంధ్ర సిఎమ్ చంద్రబాబు రాష్ట్ర ఉద్యోగులుతో మాట్లాడిన మాటలు ఇదే వైనం గుర్తుకు తెచ్చాయి.
ఈ రోజు తెలుగుదేశం అనుకూల పత్రికల్లో పతాక శీర్షికల్లో వేసిన వార్త చూస్తే, ఒక్కో ప్రభుత్వం ఉద్యోగికి వేలకు వేలు జీతం పెరిగిపోయినంత హడావుడి. వాళ్లు సమస్యలు అన్నీ గాలికి ఎగిరిపోయినంత రేంజ్ వార్త. సాధారణంగా ప్రభుత్వం ఓ విడత డిఏ ఇస్తే వందల్లో జీతం పెరుగుతుంది. గతంలో ఇలాంటి వార్తను చిన్న సింగిల్ కాలమ్ లో వేసేవారు. కానీ ఈ రోజు ఒక డిఎ ఇచ్చిన వార్త పతాక శీర్షికలకు ఎక్కింది.
ఎందుకంటే అయిదేళ్ల వైకాపా పాలనలో ఉద్యోగుల సమస్యలను భూతద్దంలో చూపించారు. చాలా మంది ఉద్యోగులు తమకు అన్యాయం జరిగిపోతోందన్న హడావుడి చేసారు. అయిదేళ్ల పాలన తరువాత ఒక్క నెల జీతం బకాయి లేదు. కానీ అసలు తమకు జీతాలే అందలేన్నంత హడావుడి జరిగిపోయింది. అంటెడెన్స్, ఫేస్ రికగ్నెజేషన్ ఇలాంటివి అన్నీ వాళ్లకు ఇబ్బంది కలిగించి, నానా యాగీ చేసారు. జగన్ (ప్రభుత్వం కాదు) ఉద్యోగులు దాచుకున్న డబ్బులు అన్నీ తినేస్తున్నాడు అనే ప్రచారం 'దేశం' అనుకూల మాధ్యమాలు సాగించాయి. ఉద్యోగులు యాంటీ వైకాపా స్టాండ్ తీసుకున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తమ సమస్యలు అన్ని గాలికి ఎగిరిపోతాయి అనుకున్నారు. జీతం ఒకటో తేదీన ఇస్తున్నారు. ఫింఛన్లు ఒకటే తేదికి ఇస్తున్నారు అదే గొప్ప వరం అని మళ్లీ తెలుగుదేశం అనుకూల మాధ్యమాలు ఊదరగొట్టాయి. ఏడాదిన్నర పాటు ఓపిగ్గా వేచి వున్న ఉద్యోగులు మెల్లగా రొడ్డెక్కడం ప్రారంభించారు. దాంతో ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయింది.
అలా చేసింది ఏమిటంటే ఒక డిఎ ఇవ్వడం. ఇంకా అయిదు డిఎ లు పెండింగ్ లో వున్నాయి. వీటిలో సగం వైకాపా ప్రభుత్వం పెండింగ్ లో వుంచినవి. మిగిలిన సగం గత ఏడాదిన్నరలో పేరుకున్నవి. దానికే మొత్తం బ్రహ్మాండం బద్దలైపోయినంత హడావుడి.
సరే ఆ సంగతి అలా వుంచితే ఈ ఒక్క డిఎ ఇవ్వడం కోసం సిఎమ్ చంద్రబాబు ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వింటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్ధం అవుతోంది. ఆఫ్ కోర్స్ దానికి కారణం వైకాపా అని అనేయడం బై డీఫాల్ట్ కామన్ అనుకోండి. మరో అయిదేళ్లు దాటినా తప్పిదాలన్నింటికీ వైకాపా నే అంటూ ముందుకు సాగడమే కూటమి విధానం కావచ్చు. ఇంతకీ చంద్రబాబు చెప్పిన మాటలు ఏమిటంటే..
పే రివిజన్ గురించి నాకు వదిలి పెట్టండి ఆర్థికంగా వెసులుబాటు వస్తే పిఆర్సీ ఇవ్వడం పెద్ద కష్టం కాదు…… (ఇంతకీ ఈ రాష్ట్రానికి కాదు ఏ రాష్ట్రానికైనా ఆర్థికంగా వెసులుబాటు ఎప్పటికి వస్తుంది)
మిగిలిన రాష్ట్రాలన్నీ మూలధన వ్యయం చేసి, అభివృద్ధి సాధిస్తుంటే, మనం మాత్రం ఎస్టాబ్లిష్ మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. నగదు బదిలీ పథకాలు అంటూ పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నాం.
2023-24 లో 93 శాతం ఎస్టాబ్లిష్ ఖర్చు వుంటే 2025=26 నాటికి 99.5 శాతానికి చేరింది. (అంటే మరి చంద్రబాబు అనుభవం వర్కవుట్ కాలేదని అనుకోవాలా)
దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలు ఎస్టాబ్లిష్ ఖర్చులను సగానికి సగం తగ్గించుకున్నాయి. కేవలం ఆంధ్ర మాత్రమే తగ్గించుకోలేకపోతోంది. నూరుశాతానికి చేరిపోయింది.
ఇలా చంద్రబాబు చాలా చెప్పుకువచ్చారు. దీని సారాంశం ఏమిటంటే ..
ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. వచ్చిన డబ్బులన్నీ ప్రభుత్వ నిర్వహణకే పోతోంది. మీకు నేను ఏమీ చేయలేను.. అని నెమ్మదిగా నచ్చ చెప్పడం అనుకోవాలి.
