#ఏపీ అప్ డేట్స్..📖
*ఉద్యొగులకు డిఏ.. నాయకులకు ఒకే..❗*
OCTOBER 19, 2025🎯
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల చర్చలు, ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో భేటీ నాటకీయంగా సాగాయి. నాలుగు డీఏలు రావాల్సి వుండగా, ఒక్కదానితో సీఎం చంద్రబాబు సరిపెట్టారు. బాబును కలిసి ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం వెరీవెరీ హ్యాపీ. అయితే ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించినంత సంతోషం, ఉద్యోగుల్లో కనిపించడం లేదు. ఒక్క డీఏ ప్రకటనతో ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు.
పీఆర్సీ, ఇంటీరియం రిలీఫ్ (ఐఆర్), వేల కోట్ల బకాయిలు తదితర కీలక అంశాలపై ఎలాంటి ముందడుగు పడకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి అట్లే వుంది. మరీ ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ వేసే విషయంలో ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకురావడంతో ఉద్యోగులు నిరుత్సాహానికి గురయ్యారు. పీఆర్సీ ఆలస్యం అవుతుండడంతో ఐఆర్ ఇస్తారని ఉద్యోగులు ఆశించారు.
అయితే ఆ ఊసు కూడా లేదు.
ఉద్యోగులకు రావాల్సిన రూ.31 వేల కోట్ల బకాయిల విషయంలో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. తమ సమస్యల విషయంలో నాడు జగన్ సర్కార్, నేడు చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరుకు పెద్ద తేడా లేదని ఉద్యోగులు వాపోతున్నారు. అయితే ఉద్యోగులతో వైసీపీ హయాంలో మొరటుగా వ్యవహరించి, తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు.
చంద్రబాబు మాత్రం తెలివిగా వ్యవహరించి, వ్యతిరేకత లేకుండా చూసుకుంటున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.
కేవలం పిలిచి మాట్లాడ్డమే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన అతిపెద్ద గౌరవమన్నట్టు సంఘాల నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శ కూడా వారి నుంచి లేకపోలేదు. వైసీపీ అనుకూల ఉద్యోగ సంఘాల నాయకులకు తాజాగా ప్రభుత్వం దగా చేసినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు అనుకూల ఉద్యోగ సంఘాల నాయకులకు మాత్రం... దీపావళి వెలుగు నింపినట్టుగా వుండడం విశేషం.
ఇక్కడే కీలక విషయాన్ని గమనించాలి. ఉద్యోగులకు ఏమీ ఇవ్వకపోయినా, ఉద్యోగ సంఘాల నాయకులకు పోయేదేమీ లేదు. ప్రభుత్వ పెద్దలతో సంబంధాలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే విమర్శను కొట్టి పారేయలేం. అందుకే కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు మోతాదుకు మించి లౌక్యం ప్రదర్శించడాన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. టీవీలు, యూట్యూబ్ చానెల్స్లో కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం తమకు ఏమీ చేయడం లేదని విమర్శిస్తూనే, మరోవైపు సీఎం చంద్రబాబును ప్రశంసించడాన్ని ఉద్యోగులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇవన్నీ సొంత పనుల్ని చక్కబెట్టుకోడానికే తప్ప, తమను ఉద్ధరించడానికి కాదని ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.
మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం జరిపి, కేవలం డీఏతో సరిపెట్టడం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పట్లో ఏమీ చేయరని, తాజా డీఏ ప్రకటనతో స్పష్టమైందని ఉద్యోగులు వాపోతున్నారు. పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ బకాయిలు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ లాంటివన్నీ కోల్డోస్టోరేజీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇదంతా చూస్తుంటే, ఉద్యోగ సంఘాల నాయకులు -ప్రభుత్వం మధ్య ఒక అవగాహనతో జరిగినట్టు కనిపిస్తోందనే అనుమానం ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది.
గతంలో సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులతో ఏనాడూ చర్చలు జరపలేదని, మీరు మాట్లాడితే చాలు, దాన్ని పెద్ద ఎత్తున పాజిటివ్ కోణంలో ప్రచారం చేస్తామని కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు అవగాహన కుదుర్చుకున్నట్టు ఉద్యోగులు అనుమానిస్తున్నారు. రాజకీయాలకు, ప్రలోభాలకు అతీతులెవరూ లేరు. ఏది ఏమైతేనేం... 16 నెలలుగా పెట్టకున్న ఆశలపై ఒక్క డీఏతో నీళ్లు చల్లారన్న విమర్శ ఉద్యోగుల నుంచి రావడాన్ని పాలకులు విస్మరించడానికి లేదు.
