#సోషల్ మీడియా #📰జాతీయం/అంతర్జాతీయం #📰జాతీయం/అంతర్జాతీయం
*అవమానాల్ని అవకాశాలుగా మలుచుకోలేమా❓*
SEPTEMBER 21, 2025🎯
అమెరికానే కాదు, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలు……… విదేశీయుల్ని తమ దేశం విడిచి వెళ్లాలని కోరుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చి, తమ బతుకుదెరువుపై దెబ్బ కొడుతున్నారని, కావున దేశం నుంచి వెళ్లిపోవాలని ఇటీవల కాలంలో భారీ ర్యాలీలు నిర్వహించడం చూస్తున్నాం.
తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పిడుగుపాటు నిర్ణయాన్ని తీసుకున్నారు. హెచ్-1 బీ వీసా వార్షిక రుసం లక్ష డాలర్లగా ప్రకటించి, షాక్ ఇచ్చారు. మన దేశ కరెన్సీలో హెచ్-1 బీ వీసా కోసం రూ.88 లక్షలు చెల్లించాలట! ఇంత భారీ మొత్తంలో వీసాకు ఖర్చు పెట్టడం అసాధ్యమనే మాట వినిపిస్తోంది. డాలర్స్ డ్రీమ్ ఇక ముగిసినట్టే అనే చర్చకు తెరలేచింది.
ఈ సందర్భంలో ప్రధాని మోదీ అద్భుత మాట అన్నారు. విదేశాలపై ఆధారపడే తత్వమే దేశానికి ప్రధాన శత్రువని మోదీ అన్న మాట అమూల్యం. స్వావలంబనే సమస్యలన్నింటికీ పరిష్కారం అన్న ఆయన మాట పచ్చి నిజం. మన దేశంలో లేని వనరులంటూ లేవు. అయితే కావాల్సిందల్లా……… మన దేశంలో మొట్టమొదట బతకడానికి సరైన వ్యవస్థను ఏర్పరచుకోవాలి. వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలి. అది పాలకులపై ఆధారపడి వుంది. ముందుగా, పరిపాలనాపరమైన వ్యవస్థను దారిలో పెట్టుకుంటే, ఆటోమేటిక్గా అన్నీ దారిలోకి వస్తాయి.
ఇక స్వావలంబన విషయానికి వస్తే, మన వనరుల్ని ఉపయోగించుకుని, అద్భుతమైన సౌధాలు నిర్మించుకోవచ్చు. ప్రధానంగా మన దేశం వ్యవసాయ రంగంపై ఆధారపడింది. అయితే సరైన సాగునీరు, పంటలకు గిట్టుబాటు ధరల్లేకపోవడం తదితర కారణాలతో వ్యవసాయం లాభసాటి కాలేదు. దీంతో వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకోలేని దయనీయ స్థితి ఏర్పడింది. దేశానికి రైతు అన్నం పెడతారనే మాట కేవలం నినాదానికే పరిమితమైంది. వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఆ రైతుకే అన్నం దొరకని దుస్థితి. పొలాన్ని నమ్ముకున్న యువకులకు అమ్మాయిల్ని ఇచ్చి వివాహాలు చేయడానికి తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు.
ఎక్కడైనా కంపెనీల్లో రూ.10 వేలు జీతం వచ్చినా సుఖంగా బతుకుతారని అనుకునే పరిస్థితి. ఇవన్నీ కూడా వ్యవసాయం లాభసాటి కాకపోవడం వల్ల కలిగిన అనర్థాలు.
సాగునీటి ప్రాజెక్ట్లను నిర్మించి, బీడు భూముల్ని పచ్చదనంతో నింపే అవకాశం కల్పిస్తే, మన దేశం సంపదతో విరాజిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే తీసుకుందాం. రాయలసీమ, ఉత్తరాంధ్రలతో పోలిస్తే నెల్లూరు, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని ప్రజల జీవన ప్రమాణాల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. దీనికి కారణం..రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సరైన సాగునీటి వ్యవస్థ ఇంత వరకూ లేదు. ఇదే నెల్లూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, అలాగే గుంటూరులోని కొన్ని ప్రాంతాలకు సాగునీళ్లు పుష్కలంగా అందుతున్నాయి. దీంతో ఆ భూముల రేట్లు ఎంతో ఎక్కువ. అలాగే ఏడాదిలో రెండు, మూడు పంటలు పండించుకుంటున్నారు. కానీ సాగునీళ్లు లేని రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరవుతో అల్లాడుతున్నారు.
ఇప్పటికీ సాగునీళ్లు అందించే ప్రయత్నాలు వేగంగా జరగడం లేదు. వ్యవసాయాన్ని కాపాడుకుంటే, ఆ రంగం మిగిలిన అన్ని రకాల వ్యాపారాల్ని రక్షిస్తుంది. రైతులు, కూలీలు ఆర్థికంగా బాగుంటే, వ్యాపారాలన్నీ కళకళలాడుతాయి. సినిమా టికెట్ల రేట్లపై పాలకులు చూపే శ్రద్ధాసక్తులు, పంటల గిట్టుబాట ధరలపై కూడా కాస్త పెడితే రైతాంగానికి మంచి రోజులు వచ్చినట్టే.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని స్థాపించుకోవచ్చు. బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్లాల్సిన దుస్థితి వుండదు. విదేశాల్లో అక్కడి పాలకులు... తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఛీత్కరిస్తుంటే, అవమానాల్ని దిగమింగుతూ అక్కడే బతకాల్సిన దుస్థితి పగవారికీ రాకూడదు.
మన దేశంలో బతకడానికి వనరులే లేవా? అంటే.. ఎన్నో ఉన్నాయనే సమాధానం వస్తుంది. కానీ లేనిదల్లా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఇక్కడి వనరుల్ని అద్భుతమైన సంపదగా మలుచుకోవచ్చనే సంకల్పం ఉన్న రాజకీయ వ్యవస్థ కొరవడింది. ఎంతసేపూ రైతులకు భిక్షం వేస్తున్నట్టుగా ఏడాదికి రూ. 6వేలని ఒకరు, రూ.14 వేలని మరొక ప్రభుత్వ హామీతో ఓటర్లగా వాడుకుంటున్నారు. ఇంతకు మించి రైతులకు శాశ్వతంగా ప్రయోజనం కలిగించే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించే వ్యవస్థల్ని తీసుకురాకపోవడం మన పాలనా వైఫల్యమే. అలాగే ఇక్కడి దుర్మార్గ రాజకీయాలు కూడా, మేధో వలసలకు కారణమవుతున్నాయి.
అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్న రాజకీయ నాయకుల్ని చూసి, విదేశాల్లో అవమానాల్సి భరిస్తాం తప్ప, మన దేశంలో బతకలేమనే ఆలోచనలకు కారణం మన నాయకులే. ఇలా విదేశాలకు మేథో వలసకు అనేక కారణాలు తోడయ్యాయి. ఇప్పుడు విదేశాల్లో అక్కడి వాళ్లకు మనం భారమవుతున్నాం. విదేశీయుల ఆందోళనలకు ఇప్పుడిప్పుడే బీజం పడుతోంది. అప్రమత్తమైన తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఏం జరుగుతుందో ఊహకు అందదు. కావున మన పాలకులు... మనవాళ్లు బతుకుదెరువుకు విదేశాలకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించుకోవాలి. మన గడ్డపై ఉపాధి అవకాశాల్ని మెరుగుపరచాలి. అందుకు తగిన కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి. స్వావలంబన కేవలం ఆలోచనకే పరిమితం కాకూడదు.