భాగవతం🙏
119 Posts • 11K views
Satya Vadapalli
743 views 1 months ago
శ్రీ మదాంధ్ర భాగవతం దశమ స్కంధం - 35 *నృగమహారాజు చరిత్రము* కృష్ణ పరమాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతయిన నుయ్యి ఉన్నది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులయిన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలయిన వారందరూ విహరిస్తున్నారు. వాళ్లకి అలసట కలిగింది. అలసట తీర్చుకోవడం కోసమని కాసిని నీళ్ళు త్రాగాలని అనుకున్నారు. అక్కడ ఉన్న నూతి దగ్గరకు వచ్చి నూతిలోకి చూశారు. అందులో పెద్ద ఊసరవెల్లి పడి ఉన్నది. దానిని చూసి వాళ్ళు తెల్లపోయారు. దానిని పైకి తీద్దామనుకున్నారు. పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి దానిని పైకి లాగడానికి ప్రయత్నించారు. కానీ పైకి తీయలేకపోయారు. వారు పరుగుపరుగున లోపలికి వెళ్ళి కృష్ణపరమాత్మకు చెప్పారు. కృష్ణ పరమాత్మ బయటకు వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేతితో ఊసరవెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డిపరకను పైకెత్తినట్లు నూతిలోంచి తీసి బయట పడేశాడు. సర్వజ్ఞుడయిన పరమాత్మ ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలయిన వారిని అడ్డుపెట్టి లోకమునకు ఒక గొప్ప ధర్మమును ఉపదేశం చెయ్యాలని అనుకుని ఊసరవెల్లిని ‘నీవు ఎందుకు ఎంత పెద్ద ఊసరవెల్లి స్వరూపమును పొందావు? ఎందువలన నీకీ జన్మ వచ్చింది?’ అని అడిగారు. ఊసరవెల్లి ఆయనకు నమస్కారం చేసి ‘మహానుభావా! నేను ఇక్ష్వాకువంశంలో జన్మించిన నృగ మహారాజుని’ అని చెప్పాడు. నృగుడు రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించిన వాడు. నృగ మహారాజుగారు రాజ్యమును పరిపాలిస్తున్న రోజులలో పరమ ధర్మాత్ముడు. ఆయన చేయని పుణ్యకార్యం లేదు. ఆయన ఒకచోట భాగవతంలో చెప్పుకున్నారు ‘నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది. కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ, కృష్ణా ఈ భూమి మీద రేణువులను లెక్కపెట్టవచ్చునేమో కానీ, నేను చేసిన దానములు లెక్కపెట్టలేరు. నేను చెయ్యని దానములు లేవు. ఒకనాడు నేను ఒక గోవును కశ్యపుడు అనే బ్రాహ్మణునకు దానం ఇచ్చాను. ఆ కశ్యపుడు ఆ గోవును తీసుకువెళ్ళి తన పెరటిలో కట్టుకున్నాడు. మరునాడు ఆ గోవును పచ్చిగడ్డి మేయడం కోసమని వదిలాడు. ఆ గోవు తప్పించుకుని అలవాటు ప్రకారం ఇంతకు పూర్వం తాను ఉండే మహారాజుగారి ఆలమందలోకి వెళ్ళిపోయింది. రాజు తాను దానం ఇచ్చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయిందనే విషయమును గుర్తించలేక అదే ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం చేశాడు. వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవును తోలుకుని వెళ్ళిపోతున్నాడు. కశ్యపుడికి తాను దానం పుచ్చుకున్న ఆవు ఒకే ఒక జీవనాధారమై ఉన్నది ఆ ఆవు కనపడడం లేదు. ఆ ఆవుకోసమని వెతుకుతున్నాడు. దానిని వేరొక బ్రాహ్మణుడు తీసుకువెడుతున్నాడు. కశ్యపుడు దానిని చూసి ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్లి ‘అది నా ఆవు. నృగ మహారాజు గారు దానిని నాకు దానం చేశారు’ అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు ‘నేను ఇప్పుడే పుచ్చుకున్నాను. నేను గోచౌర్యం చేసిన వాడిని కాదు. నేను ఇప్పుడే రాజు దగ్గర ఈ గోవును దానం పుచ్చుకుని తీసుకువెడుతున్నాను’ అన్నాడు. ‘లేదు ఈ గోవు నాది’ అన్నాడు కశ్యపుడు. ‘కాదు ఈ గోవు నాది’ అన్నాడు బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రభస బయలుదేరింది. ఇద్దరు కలిసి నృగ మహారాజు దగ్గరికి వెళ్ళారు. ‘అయ్యా, ఈ గోవును యింతకు పూర్వం నాకు దానం ఇచ్చావు. అదే ఆవు నీ మందలో కలిసిపోయింది. నీవు మరల ఈ ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం ఇచ్చావు. నా ఆవును నాకు యిప్పించు’ అని రాజును కశ్యపుడు అడిగాడు. రాజుగారు రెండవ బ్రాహ్మణునితో ‘నా వల్ల పొరపాటు జరిగింది. నీకు దానం ఇచ్చిన గోవు ఇంతకు పూర్వం కశ్యపునకు దానం ఇచ్చేసిన గోవు. ఆ గోవును నీవు ఇచ్చేసినట్లయితే ఆ గోవును కశ్యపునకు ఇస్తాను. అన్నాడు. రెండవ బ్రాహ్మణుడు తనకు ‘ఆ ఆవే కావాలి’ అని తన దగ్గర ఉన్న ఆవును తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు. రాజుగారు ‘నీకు లక్ష గోవులను ఇస్తాను. ఈ గోవును విడిచిపెట్టు’ అన్నాడు. ‘నాకు ఎన్ని గోవులు ఇచ్చినా అక్కర్లేదు. నాకు ఈ గోవే కావాలి’ అని రెండవ బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకుని వెళ్ళిపోయాడు. రాజు కశ్యపుని చూసి ‘నీకు నా రాజ్యంలోని భాగమును ఇమ్మంటే ఇస్తాను. నీకు ఎన్ని వేల గోవులు కావాలంటే అన్ని వేల గోవులను ఇస్తాను. తీసుకువెళ్ళు’ అన్నాడు. కశ్యపుడు ‘నేను అడిగిన గోవును ఇవ్వలేక పోయావు. ఇంక నాకు ఇవ్వవలసినది ఏమీ లేదు’ అని వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. నృగ మహారాజుగారి శరీరం కూడా పతనం అయిపోయింది. ఈయనను స్వర్గలోకమునకు తీసుకువెళ్ళబోతున్నారు. అపుడు దూతలు మీరు అనుభవించవలసిన చిన్న పాపఫలితం ఒకటి ఉన్నది. అది అయిపోయిన తరువాత మిమ్ములను స్వర్గ లోకమునకు తీసుకు వెళతాము. ఆ పాపఫలితం పూర్తి అయిపోయే వరకు పెద్ద ఊసరవెల్లియై నూతిలో పడి ఉండండి’ అన్నారు. నృగ మహారాజు తాను చేసిన పాపమేమిటని వారిని ప్రశ్నించగా వారు ‘నీవు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవును వేరొక బ్రాహ్మణునకు దానం ఇచ్చావు. ఊసరవెల్లివై పడి ఉండు’ అన్నారు. ఈమాటలు నృగ మహారాజు కృష్ణ పరమాత్మకు చెప్పాడు. పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఆ ఊసరవెల్లి తాను చేసిన పాపమును పోగొట్టుకొని ఊర్ధ్వలోకముల నుండి వచ్చిన రథమును ఎక్కి నృగమహారాజు కృష్ణ పరమాత్మకు నమస్కరించి వెళ్ళిపోయారు. కృష్ణ పరమాత్మ *‘బ్రాహ్మణులకు చెందిన ధనమును తెలిసి కాని, తెలియక గాని ఎవరయినా అపహరిస్తే, అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటివెంట నీటిబిందువు కిందపడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకములను అనుభవిస్తాడు.* నా భక్తుడిగా ఉండాలనుకున్న వాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజేయడానికి వీలులేదు. ఎవరు బ్రాహ్మణ ద్రవ్యము మీద ఆశ పెట్టుకుంటాడో వాడిని ఎప్పటికీ నా భక్తునిగా నేను చేరనివ్వను. బ్రాహ్మణుల పట్ల నాకు ఉన్న భక్తి అటువంటిది’ అన్నారు. ఇక్కడ మనకి కొన్ని సందేహములు కలుగుతాయి. నృగుడు బ్రాహ్మణునకు లక్ష గోవులను ఇస్తానన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ గోవును కశ్యపునకు వదిలివేయవచ్చు కదా! ఆ బ్రాహ్మణునకు అంత మౌడ్యమేమిటి? పోనీ బ్రాహ్మణుడు మూఢుడై ఉండవచ్చు. కశ్యపునకు గోవు కాకపోతే రాజ్యం ఇస్తానన్నాడు. కశ్యపుడు తనకి ఆ గోవే కావాలని రాజ్యం, ఇతర గోవులు అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఏదయినా పొరపాటు జరిగితే దిద్దుకోవలసిన అవసరం బ్రాహ్మణులకు లేదా? బ్రాహ్మణుడయిన వాడు ఇతరులు చేసిన తప్పు దిద్ది దానివలన అవతలి వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి. అది అతని బాధ్యత. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులిద్దరూ అలా ప్రవర్తించవచ్చునా? కృష్ణుడు కూడా కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా? ఇవీ ఇక్కడ కలిగే సందేహములు. వీటికి సమాధానములను కొందరు పెద్దలు వివరణ ఇచ్చారు. బ్రాహ్మణుడు అనగా ఎవరు? ఒక గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని తనకు ఉన్న దానిచేత ఎప్పుడూ తృప్తిపడిపోయి ఎవరు పరిపూర్ణమయిన సంతృప్తితో ఉంటాడో, ఎవడు తనకు ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు. *బ్రాహ్మణుడు దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప దొరికిన దానిని అడ్డుపెట్టుకుని చాలా సంపాదించెయ్యాలని అనుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది.* కశ్యపునికి ఆవుకి బదులుగా ఏదయినా ఇస్తానన్నా ఆయన ఆశ పొందలేదు. దానిని అంగీకరించలేదు. రాజు నావలన మహాపరాధం జరిగింది నన్ను మన్నించండని ఒక మాట అని బ్రాహ్మణుల పాదములు పట్టుకుని ఉండాలి. రాజు అవతలి వారియందు ఉన్న తృప్తిని గమనించలేకపోయాడు. బేరం పెట్టాడు. వాళ్ళిద్దరూ తమకి అక్కరలేదని తమ బ్రాహ్మణ్యమును నిలుపుకున్నారు. *బ్రాహ్మణ్యము అనేది అపారమయిన తృప్తితో పొందవలసిన లక్షణము.* దానము చేయబడిన ఆవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో రాజు ఏమరుపాటు పొందాడు. తప్పును రాజు ఖాతాలో వేశారు. దానికి ప్రాయశ్చిత్తం ఆ పాపఫలితమును అనుభవించడమే. కృష్ణ పరమాత్మ ఇంకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప ఊసరవెల్లి జన్మ రాకుండా చేయలేకపోయారు. ఈ ఆఖ్యానం వినడానికి చాలా చిన్నకధలా ఉంటుంది. కానీ ఇందులో మనకి గొప్ప ధర్మం తెలుస్తుంది. దానం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు ఈ కధ నేర్పుతుంది. *దానం చేసేటప్పుడు చూపే వినయం వలన ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానమునకు ఫలితమును ఇస్తాడు. దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం.* శ్రద్ధ లేకపోవడం వలననే రాజును పాపం అనుభవింప చేసింది. *నేనిస్తున్నాననే అహంకారం ఉండకూడదు. శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకుని అనంతమయిన ఫలితమును ఇచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించ గలిగిన శుభ ఫలితములను ఇవ్వడానికి దానం పుచ్చుకున్నాడు నేను మిక్కిలి ధన్యుడను అని భావిస్తూ దానం పుచ్చుకున్న వాడికి నమస్కరించాలి.* ఈ కథ అంత విశేషమయిన స్థితిని అవిష్కరిస్తుంది. #భాగవతం🙏 #జై శ్రీకృష్ణ 🚩 #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #🌅శుభోదయం
15 likes
10 shares
Satya Vadapalli
4K views 1 months ago
శ్రీమదాంధ్ర భాగవతం దశమస్కంధం - 35 *ఉషా పరిణయం* పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు. బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. ఆ నూర్గురు కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. అతను శోణపురమును పరిపాలన చేస్తున్నాడు. వేయి చేతులు ఉన్న బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. అది అసురసంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి అయిదువందల వాద్య పరికరములను తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. ‘వేయి చేతులతో అయిదువందల వాద్య పరికరములను ఎంతో గొప్పగా వాయించావు’ అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. అతను పరుగుపరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు ‘నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను’ అన్నాడు. వానిలో ఉన్న అసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంతో చిత్రమయిన కోరిక కోరాడు. 'ఈశ్వరా! నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకొక ఉపకారం చేసిపెట్టాలి. పార్వతీ దేవితో కలిసిన వాడివై, నేను కోటలోపల ఉంటే నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోర్కెలు తీర్చడంలో వశుడవయిపోయే వాడివి కదా! అందుకని నాకీ కోరిక తీరుస్తావా? ' అని అడిగాడు. శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు. పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటు యిటూ తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అనుయాయులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ఈవిధంగా శంకరుడు కోట బయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. ఎప్పుడయితే పరమశివుడు బాణాసురుని కోటకు కాపుదలగా ఉన్నాడని తెలిసిందో ఇంక బాణాసురుని వైపు కన్నెత్తి చూసిన వాడు లేడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి ‘శంకరా! ఆరోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవరూ వచ్చి నాతో యుద్ధం చేయడం లేదు. నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది’ అని కోరాడు. భగవంతుని కారుణ్యం వానికి చులకనగా కనపడింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది రక్షించవలసినవాడూ తానే. వాడు అడిగిన కోరికకు శిక్షించవలసిన వాడూ తానే. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకు ఉన్న ఇంకొక రూపంతో వేయాలి. ‘నాతో సమానమయిన ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథమునకు వున్న జండా క్రింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. నీకున్న వ్యగ్రత పోతుంది’ అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆరోజు గురించి ఎదురుచూస్తున్నాడు. శివుడు స్థితికారుడై కేశవుడిగా రావాలి. పురాణమును అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే శివ కేశవులు కొట్టుకున్నారని అనిపిస్తుంది. మన అజ్ఞానమును బాణాసురుని స్థాయికి తీసుకువస్తుంది. ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యౌవనంలో అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఉన్నది. ఆమె పేరు ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతోంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనుమడయిన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకు సుఖానుభూతి కొన్ని కొన్ని గుర్తుల చేత స్పష్టముగా తెలిసింది. ఆవిడ నిద్రలేచింది. ఆవిడ నిన్నరాత్రి కలలో ఏ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనస్సు గతితప్పి తిరగడం మొదలుపెట్టింది. ప్రతిరోజూ ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చెలికత్తె ఒకతె ఉన్నది. ఆవిడ వచ్చి 'నీవు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పువలన నేను ఒక విషయమును గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుని వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను. ప్రాణ స్నేహితురాలను. అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పవలసింది’ అని అడిగితే ఉష తన స్వప్న వృత్తాంతం చెప్పింది. చిత్రలేఖ సఖీ! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. నేను ఎందరో రాజాధిరాజులను చూసాను. వాళ్ళ చిత్ర పటములను గీస్తాను నేను. అవి చూసి ఇందులో ఎవరు కనపడ్డారో చెప్పు’ అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. పిమ్మట ఉషాదేవిని పిలిచి ఆ చిత్రములను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరుపేరునా వివరించింది. అనిరుద్ధుని చిత్రమును ఆమె గుర్తించింది. చిత్రలేఖ ‘ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయనయందా నీవు మనసు పడ్డావు? సఖీ! ఇప్పుడు నేను నీకొక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. ఇవాళ రాత్రి నేను ద్వారకానగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకువచ్చి నీ హంసతూలికాతల్పం మీద పడుకోబెడతాను. నీవు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు.’ అని చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది. బయట మూడుకన్నులున్న వాడు ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. ఈయన వరం నిలబెట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు. శివకేశవుల ఇద్దరి మనస్సులు ఒక్కటే. అక్కడ కృష్ణ భగవానుడు ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలో ప్రవేశించి నిద్రపోతున్న అనిరుద్ధుని ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయనను తీసుకొని ఆకాశమార్గంలో తిరిగి వచ్చేసి లోపలి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుని తీసుకొని కోటలోపలికి వెళ్ళడం బయట కోటకి కాపలా కాస్తున్న మూడు కన్నులవాడు చూశాడు. ఏమీ అభ్యంతర పెట్టలేదు. చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకోపెట్టేసింది. ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు. ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక మూర్తియే రెండుగా ఉన్నాడు. ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారు. నెలలు నెలలు కాలం గడిచిపోతున్నది. కాలం ఎల్లప్పుడూ ఒకేరీతిగా ఉండదు. ఉషాదేవి యందు గర్భిణి చిహ్నములు కనపడ్డాయి. ఈ విషయమును పరిచారికలు వెళ్ళి బాణాసురునికి చెప్పారు. బాణాసురునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఎవరు ఈ తుంటరి పని చేసినవాడని ఉషాదేవి అంతఃపురమునకు వచ్చి కూతురుని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు కనపడ్డాడు. అనిరుద్ధుని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్లి అనిరుద్డుడిని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రహారములతో వారినందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురునికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుని నాగ పాశముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి ప్రభూ మీ రథం మీద ఉన్న జండా విరిగి క్రిందపడిపోయింది అని చెప్పారు. తనతో యుద్ధము చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్ళకు తన కోరిక తీరబోతున్నదనుకొని బయలుదేరాడు. వానికి కూతురి గొడవ అక్కరలేదు. యుద్ధం కావాలి. ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగని వాడిలో అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు 'అనిరుద్ధుడిని బాణాసురుడు నాగ పాశములతో బంధించాడు. నీవు వెంటనే బయలుదేరవలసినది’ అని చెప్పాడు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లు బయలుదేరి శోణపురం మీదికి యుద్ధమునకు వెళ్ళారు. బాణాసురునికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుని పిలిచి 'నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపు ఉన్నావు. నీవు కృష్ణుడు కోటలోపలికి రాకుండా యుద్ధం చేయాలి. మాత్రమే నీవు నాకిచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. ముందుగా నీవు యుద్ధం చేసి, కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది’ అని అన్నాడు. శంకరుడు భక్త వత్సలుడు. భక్తునికి ఇచ్చిన మాట తప్పడానికి వీలు లేదు. శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి. కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవశంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. యుద్ధం ప్రారంభం అయింది. శివుడు యుద్ధంలో లొంగనంత సేపు బాణాసురుని జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీలులేదు. తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తానిచ్చిన వరమునకు మినహాయింపు ఇచ్చినట్లు అవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు నందీశ్వరుని మీద వాలిపోయాడు. కృష్ణుడు బాణాసురుని మీదకు యుద్ధమునకు బయలుదేరాడు. శివజ్వరము అనబడే శక్తి ఒకటి బయలుదేరింది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడు వైష్ణవ జ్వరమును ప్రకోపం చేశాడు. ఆ రెండు శక్తులు ఒకదానితో ఒకటి డీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణువును ప్రార్థన చేసింది. ఉషాపరిణయ ఘట్టంలో పార్వతీ పరమేశ్వరుల వలన, కృష్ణ భగవానుడి వలన లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషాపరిణయ ఘట్టంలో శివజ్వరం, విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో, వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమయినదిగా జ్వరము బాధించడానికి వీలులేదు. ఆ మేరకు నేను వరం యిస్తున్నాను అన్నాడు. *ఎప్పుడయినా జ్వరము చేత ప్రాణాంతకం అవుతోందని అనుకుంటే ఉషా పరిణయమును శరణాగతి తత్త్వమును చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం చేస్తారు.* అంత గొప్ప వరమును ఇస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతిని పొందింది. వెంటనే బాణాసురుడు యుద్ధమునకు వచ్చాడు. పరమాత్మ చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది. తన కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని తల్లియైన కోటర ఆ రోజున యుద్ధమునకు వచ్చి ఒంటిమీద ఉన్న వలువలన్నిటిని విప్పేసి, జుట్టు విరబోసుకుని చేతులు పైకెత్తి హాహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రయై జుట్టు విడివడి ఎదురునిలబడితే ఛీ అని తల తిప్పుకుని ధనుస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసురుడు కోటలోకి పారిపోయాడు. మరునాడు మరల యుద్ధం ప్రారంభం అయింది. శంకరుడు ‘నేను కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడు పడిపోవడానికి వీలులేదని తగిన విధంగా నీవు వానికి శిక్ష వేయవలసినదని కృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు. శివకేశవుల హృదయములు ఒకరికొకరు తెలుసు. ఉన్న ఒక్క పదార్ధం రెండుగా కనపడుతోంది. ఆరోజు కృష్ణ భగవానుడు బాణాసురునకు ఉన్న బాహువులలో 996బాహువులను సుదర్శన చక్రధారల చేత తరిగేసాడు. నాలుగు బాహువులను వదిలేశాడు. వానికి ధర్మార్థ కామ మోక్షములు తెలిశాయి. వాని శరీరమునందు రజోగుణ తమో గుణములు లేవు. శుద్ధ సత్త్వంతో ఉంటాడు. ‘ఈశ్వరా! వీడు నీ భక్తులలో అగ్రగణ్యుడు అవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడని చెప్పుకుంటారు. ఎక్కడ అసురసంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉష అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయములు సంభవిస్తాయి. నాలుగు చేతులతో వీనిని వదిలేస్తున్నాను. ఇంకా ఎప్పుడూ ప్రమాదముతో కూడిన ప్రవర్తన వీడియందు ఉండదు’ అని ఆరోజున కృష్ణ భగవానుడు వరం ఇచ్చాడు. శంకరుడు సంతోషమును పొందాడు. బాణాసురుడు శివుని పరివారంలో చేరిపోయాడు. వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. ఇప్పుడు అతను తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసం చేరుకున్నాడు. బాణాసురుడు కోటలోకి వెళ్లి అనిరుద్ధుడికి, ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు, ఆభరణములు బహూకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారక నగరమునకు సాగనంపాడు. ఈవిధంగా ఉషాపరిణయం అనే ఘట్టము ఎన్నో రహస్యములను ఆవిష్కరించింది. *ఎవరు ఈ ఘట్టాన్ని వింటున్నారో ఎవరు పరమ శివుడంతటి వాడిని కింకరునిగా చేసుకున్నాడో ఎవరు తుట్టతుదకు నాలుగు చేతులతో, పరమశివునికే కింకరుడు అయ్యాడో కృష్ణుని విజయమునకు పొంగిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారో, కల్పాంతం వరకు ఎవరు ఈ బాణాసుర కథ, కృష్ణ విజయం వింటున్నారో ఆయన నామం ఎవరు చెపుతారో వారికి సమస్త విజయములు చేకూరుతాయి. వాళ్లకి ఓటమి సంభవించదు. జయము కావాలనుకున్న పరిస్థితులలో ఈ ఉషాపరిణయఘట్టమును, బాణాసుర ఘట్టమును ఒక్కసారి పారాయణ చేసుకొని బయలుదేరుతుంటారు. ఇది అంతగొప్ప ఆఖ్యానము.* #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 #జై శ్రీకృష్ణ 🚩 #భాగవతం🙏 #🙏🏻భక్తి సమాచారం😲
52 likes
1 comment 49 shares
Satya Vadapalli
1K views 1 months ago
శ్రీమదాంధ్ర భాగవతం దశమ స్కంధం - 34 *బలరాముడు రుక్మిని చంపుట* రుక్మికి రుక్మిణీ దేవి అంటే చాలా ఇష్టం. కృష్ణుని మీద మాత్రం అంత పెద్ద ప్రీతి లేదు. *పాము చుట్టం పడగ విరోధం. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా కుటుంబాలలో ఈ లక్షణం ఉంటుంది. అల్లుడుగారు కావాలి. అల్లుడుగారి నాన్న గారు, అమ్మగారు ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడు అవ్వాలి. ఆ పిల్లవాడికి అక్క చెల్లెళ్ళు, ఉండకూడదు. అల్లుడు గారు తన భార్య అక్క చెల్లెళ్ళను ఎంతగానో ఆదరించాలి. ఆ పిల్లవాడు తన అక్కచెల్లెళ్ళను చూడకూడదు. కొంతమంది ఆలోచనలు ఇంత హేయంగా ఉంటాయి. ఇది వ్యక్తులకు ఉండవలసిన లక్షణం కాదు. రుక్మికి సంబంధించిన ఈ ఘట్టం ఇందుకు సంబంధించిన విషయములను విశదపరుస్తుంది. పురాణమును మన జీవితమునకు సమన్వయము చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దాని వలన మనం ప్రయోజనమును పొందగలుగుతాము. లేకపోతే అది జీవితమును ఉద్ధరించదు.* రుక్మికి రుక్మిణి అంటే తోడపుట్టింది కాబట్టి ప్రేమ. కృష్ణ భగవానుడు అంటే అంత ప్రీతి లేదు. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతిని మేనల్లుడయిన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. తన వేరొక కుమార్తె అయిన చారుమతిని కృతవర్మకు ఇచ్చి వివాహం చేశాడు. మనవరాలయిన రుక్మలోచనను కృష్ణుని మనుమడయిన అనిరుద్ధునకిచ్చి వివాహం చేశాడు. ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుని వివాహమునకు కృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి విదర్భ రాజ్యమునకు వెళ్ళారు. అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా జరిగిపోయాయి. వేడుకలు పూర్తి అయిన పిమ్మట కొత్త పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు అందరు బయలుదేరి పోవడానికి సిద్ధపడుతున్నారు. అక్కడికి కళింగరాజు వచ్చాడు. కళింగ రాజు లేనిపోని పెద్దరికం తెచ్చిపెట్టుకునే తత్త్వం కలిగిన వాడు. కడుపులో చాలా బాధ పడిపోతున్నాడు. వారందరూ అలా సుఖంగా ఉండడం అతనికి సహింపరానిది అయింది. వెంటనే అతను రుక్మి దగ్గరకు వెళ్లి ‘ నీకేమయినా బుద్ధి ఉన్నదా? నీకు జరిగిన అవమానమును ఎంత తొందరగా మర్చిపోయావు. నీ కూతురుని కృష్ణుడు కొడుకుకు ఇచ్చి వివాహం చేస్తావా? ఆరోజున కృష్ణుడు తన ఉత్తరీయం తీసి నిన్ను బండి చక్రమునకు కట్టి కత్తిపట్టి నీ జడను పాయలు పాయలుగా గొరిగి వదిలిపెట్టాడు. రాజులందరూ నిన్ను చూసి నవ్వితే నీవు భోజ కటకమును రాజధానిగా చేసుకుని ఉండిపోయావు. ఇవాళ ఆ రుక్మిణీ దేవికి కృష్ణునియందు పుట్టిన కొడుక్కి నీ కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తావా! నీకు జరిగిన అవమానం చాలా తొందరగా మర్చిపోయావే. నీ మనస్సు మంచిదే. నీవు చాల తొందరగా నీ అవమానములు మర్చిపోతావు’ అన్నాడు. ఇతని మాటలు విన్న రుక్మి ‘బలరామ కృష్ణులను ఎలా అవమానించ గలను?’అని కళింగ రాజుని అడిగాడు. కళింగ భూపతి ‘బలరాముడికి ద్యూతం ఆడడం అంత బాగా రాదు. ద్యూతమునకు రమ్మనమని ఆహ్వానిస్తే రానని అనడు కదా! కాబట్టి బలరాముణ్ణి ద్యూతమునకు రమ్మనమని పిలు. అతను వస్తాడు. పందెములు పెట్టు. వరుసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా నవ్వుతూ ఉండు. బలరాముడు కుపితుడయిపోతాడు. అన్నగారు అలా ఓడిపోతూ నువ్వు నువ్వుతుంటే కృష్ణుడి మనస్సు ఖేదపడిపోతుంది. అలా నువ్వు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి’ అన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. రుక్మి బలరాముని ద్యూతమునకు పిలిచి ఓడిపోయినప్పుడల్లా నవ్వుతూ ఉండేవాడు. బలరాముడు సహిస్తున్నాడు. కృష్ణుడు అన్నీ ఎరిగి ఉన్నవాడు ఏమీ తెలియని వాడిలా చూస్తున్నాడు. ఆఖరున బలరాముడికి కోపం వచ్చి లక్ష రూకలను ఒడ్డాడు. బలరాముడు గెలిచాడు. ‘నేను గెలిచాను’ అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి. అక్కడ కూర్చున్న వారు రుక్మి పక్షం వహించినట్లుగా ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. బలరాముడు సరే వేరొకసారి లక్ష ఒడ్డుతున్నానని మళ్ళీ ఆడి గెలిచాడు. ఇప్పుడు కూడా నేనే గెలిచాను అని అన్నాడు రుక్మి. అశరీరవాణి ఈ ఆటలో బలరాముడే గెలిచాడని పలికింది. ఇంత అశరీర వాణి చెప్పినా రుక్మి నవ్వుతూ నువ్వు గొల్లలలో పుట్టిన వాడివి, ఆవుల వెంట, దూడల వెంట అరణ్యములలో తిరుగుతూ గోవులను కాసుకునే వాడివి. నీవు రాజులతో ద్యూతం ఆడడం ఏమిటి? నీవేమి మాట్లాడుతున్నావు? అన్నాడు. బలరాముడు ఇంక వీడిని ఊరుకోవడానికి వీలు లేదని అనుకున్నాడు. రుక్మిని ప్రోత్సహించిన కళింగ భూపతిని చూసి తను కూర్చున్న ఆసనం మీదనుంచి లేచి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు. పళ్ళు ఊడిపోయి క్రింద పడిపోయి కళింగ భూపతి నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు. రుక్మి దగ్గరకు వచ్చి కంఠం క్రింద చెయ్యి వేసి పైకెత్తి ఒక్కదెబ్బ కొట్టాడు. మూతి వెనక్కు వెళ్ళిపోయి నెత్తురు కక్కుకుని రుక్మి చచ్చిపోయాడు. కృష్ణుడు లేచి ‘రుక్మిణీ బయలు దేరదామా’ అన్నాడు. తప్పకుండా బయలుదేరదాము అన్నది. ఆవిడకి కృష్ణుడు ఎంత చెప్తే అంత తన పుట్టింటివారనే మమకారములు ఆవిడకు లేవు. ‘నా భర్త ధర్మమూర్తి. ఆయనకు తెలుసు ఏమిచేయాలో, ఆయన ఏమి చేస్తే అదే యధార్థం. అని ఆమె భావించింది. తన భర్తతో కలిసి రుక్మిణీ దేవి రథం ఎక్కి వెళ్ళిపోయింది. బలరాముడు వెళ్ళిపోయాడు. యాదవులు వెళ్ళిపోయారు. #భాగవతం🙏 #జై శ్రీకృష్ణ 🚩 #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #🙏🏻భక్తి సమాచారం😲
25 likes
18 shares
Satya Vadapalli
3K views 1 months ago
శ్రీ మదాంధ్ర భాగవతం దశమ స్కంధం - 33 *రుక్మిణీ విజయం* ఒకనాడు కృష్ణభగవానుడు పరమసంతోషంగా రుక్మిణీ దేవి మందిరంలోకి ప్రవేశించారు. అది అసురసంధ్య వేళ దాటిన కాలం. ఆ ఇల్లు కర్పూరము, అగరు మొదలయిన సువాసనలతో ఉన్నది. కృష్ణ పరమాత్మ ఆగమనమును తెలుసుకున్న రుక్మిణీదేవి గబగబా వెళ్లి ఆ పరిచారిక చేతిలో ఉన్న దండమును తాను తీసుకొని కృష్ణ పరమాత్మకి విసురుతోంది. కృష్ణుడు రుక్మిణి వంక చూసి పరమ ప్రసన్నుడై ఆమెతో 'రుక్మిణీ! నిన్ను చూస్తే చాలా పొరపాటు చేశావేమో అనిపిస్తున్నది. నేను ఐశ్వర్య హీనుడను, దరిద్రుడను. ఎక్కడో సముద్రగర్భంలో ఇల్లు కట్టుకున్న వాడిని. నీకు శిశుపాలుడి వంటి మహా ఐశ్వర్యవంతునితో వివాహం సిద్ధం చేశాడు నీ అన్న. నిష్కారణంగా అంత మంచి సంబంధం విడిచి పెట్టి ఏమీ చేతకాని వాడిని, పిరికివాడిని, సముద్ర గర్భంలో ఉన్నవాడిని, దరిద్రుడిని అయిన నన్ను నీవు చేపట్టేవేమో అనిపిస్తోంది. నీవు చేసిన పొరపాటును దిద్దుకోవాలని నీ మనసులో కోరిక ఉంటే అలాంటి అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈమాటలు వింటున్నప్పుడు రుక్మిణీ దేవి ముఖ కవళికలు మారిపోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా అదిరిపోయి స్పృహ తప్పి క్రింద పడిపోయింది. ఇన్ని మాటలు మాట్లాడిన కృష్ణుడు గబగబా రుక్మిణీ దేవి దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో ఎత్తి ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒళ్ళు చల్లబడడం కోసం ఒళ్ళంతా గంధమును రాశాడు. కళ్ళనుండి వెలువడే కన్నీటిని పన్నీటితో కడిగాడు. కర్పూర వాసనవచ్చే పలుకులు ఆమె చెవులలోకి ఊదాడు. ఆమె నేలమీద పడిపోయినప్పుడు ఆమె వేసుకున్న హారములన్నీ చిక్కుపడిపోయాయి. వాటి చిక్కులు విడదీసి గుండెల మీద చక్కగా వేశాడు. చెమట పట్టి కరిగిపోతున్న కుంకుమను చక్కగా దిద్ది చెమటనంతా తుడిచివేశాడు. తామర పువ్వురేకులతో చేసిన పెద్ద విసనకర్రను తెప్పించి దానితో విసిరాడు. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్లు ఆమె ప్రసన్న మయేటట్లు ప్రవర్తించి ఆవిడను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అదేమిటి రుక్మిణీ నేను నీతో విరసోక్తులాడాను. ఆ మాటలకు నీవు ఇంత నొచ్చుకుని అలా పడిపోయావేమిటి’ అన్నాడు. కృష్ణుడు ఇలా మాట్లాడవచ్చునా? అని అనుమానం రావచ్చు. కృష్ణుడు అలా మాట్లాడడానికి ఒక కారణం ఉన్నది. రుక్మిణీదేవి యందు చిన్న దోషం కలిగింది. *చిన్న దోషమును స్వామి సత్యభామ యందు భరిస్తాడు కానీ రుక్మిణీదేవియందు భరించడు.* రుక్మిణీ దేవికి కొద్దిపాటి అతిశయం వచ్చింది. ‘అష్టమహిషులలో నేను పట్టమహిషిని. కృష్ణ పరమాత్మ తప్పకుండ నా మందిరమునకు విచ్చేస్తూ ఉంటారు’ అని ఆమె మనస్సులో కొద్దిపాటి అహంకారం పొడసూపింది. యథార్థమునకు కృష్ణ పరమాత్మ పదహారు వేల ఎనిమిది మంది గోపికల ఇంట్లోనూ కూడా కనపడతాడు. ప్రతిరోజూ ఉంటాడు. అందరితోనూ క్రీడించినట్లు ఉంటాడు. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. అది మేధకు అందే విషయం కాదు. రుక్మిణీదేవికి కలిగిన చిన్న అతిశయం పెరిగి పెద్దదయి పోతే ఆవిడ ఉపద్రవమును తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆవిడ లక్ష్మి అంశ. కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఈ అతిశయ భావనను ఆమెనుండి తీసివేస్తే ఆమె పరమ మంగళప్రదురాలిగా నిలబడుతుంది. అందుకు కృష్ణుడు ఆమెను దిద్దుబాటు చెయ్యాలని మాట్లాడిన మాట తప్ప, ఆయన ఏదో కడుపులో పెట్టుకుని మాట్లాడిన మాట కాదు. కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించిన తీరు ఆమె అభ్యున్నతి కొరకు ప్రవర్తించిన ప్రవర్తన. కృష్ణుని మాటలు విన్న అమ్మవారు చాలా అద్భుతమయిన విషయమును చెప్పింది. ‘కృష్ణా! మీరు చెప్పిన అన్నీ పరమ యదార్థములు. నేను చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని, మీకు మాత్రమే పత్నిని కావాలని పలవరించి పలవరించి మీకు భార్యనయ్యాను. *మీరు లోకులు అందరివలె ఉండేవారు కాదు. మీరు పరమాత్మ. అందుకే మిమ్మల్ని చేరుకున్నాను. ధనగర్వం కలిగిన ఐశ్వర్యవంతులెవరు నీకు చుట్టాలు కారు. తాము ఐశ్వర్యవంతులమనే గర్వం కలిగి మిగిలిన వారిని చిన్నచూపు చూసే వారు నీకు చుట్టాలు కారు. అన్నీ ఉన్నా అన్నిటినీ విడిచిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుని కోసమే జీవితం గడిపే పరమ భాగవతోత్తములకు చెందినవాడవు. పరబ్రహ్మ స్వరూపుడవు. నీ నడవడి ఒకరు అర్థం చేసుకోలేని రీతిలో ఉండేవాడవు. అన్నీ విడిచిపెట్టేసి ఒక్క ఈశ్వరునే చెయ్యి చాపి అడగడమే తప్ప, వేరొకరి దగ్గర చెయ్యి చాపనని అన్నవాడి దగ్గర చెయ్యి చాపేవాడివి.* *సౌందర్య వంతులయిన కాంతలతో నీకు పని లేదు. నీకు బాహ్య సౌందర్యముతో పనిలేదు. నీకు కావలసినది అంతఃసౌందర్యము.* కృష్ణా, నీవు అన్న మాటలలోని చమత్కారమును నేను గ్రహించగలిగాను. ఇటువంటి వాడివి కాబట్టే నిన్ను చేరుకున్నాను. ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం అదే. చాతక పక్షి వలె నా జన్మ ఉన్నంత కాలము నీ పాదములను సేవించే దానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేతకాని, వాక్కు చేతకాని, చేరేదానను కాను. నీవు ఇవ్వగలిగిన వరం ఉన్నట్లయితే నాకు దానిని ఇవ్వు’ అని అడిగింది. కృష్ణుడు ‘రుక్మిణీ! నీవు పరమ పతివ్రతవు. ఇప్పటి వరకు *కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గరయినా నిలబడి తనను క్షమించమని అడిగిన సందర్భం లేదు. మొట్టమొదటి సారి రుక్మిణీ దేవి దగ్గర అడిగాడు. అనగా ఈశ్వరుడు తన కింకరుడిగా ఉండాలని కోరుకున్న వాని దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఈశ్వరుడు అంతవశుడు అవుతాడని తెలియజేస్తూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవలసిన విధానమును విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్లుగా చూపించిన ఒక మహోత్కృష్టమయిన ఘట్టం ఈ ఘట్టం.* రుక్మిణీ దేవి కృష్ణుడిని వశం చేసుకుని తన వాడిని చేసుకుంది. ఇది రుక్మిణీ విజయం. దానిని మన విజయంగా మనం మార్చుకోవడంలో భాగవతం వినడం చేత మనం పొందవలసిన విజయము. #🙏🏻భక్తి సమాచారం😲 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 #జై శ్రీకృష్ణ 🚩 #భాగవతం🙏
84 likes
2 comments 44 shares