#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ #జగన్
*జగన్కు కోపం తెప్పించి.. రప్పించుకుంటూ❗*
OCTOBER 6, 2025🎯
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దగా నోటికి పని చెప్పరు. అయితే రాజకీయ ప్రత్యర్థుల్లో తనపై అవాకులు చెవాకులు పేలే వారిని ఆయన జాగ్రత్తగా గమనిస్తుంటారు. ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇటీవల శాసనసభ సమావేశాల్లో వైఎస్ జగన్పై నోరు పారేసుకున్నారు. ప్రతిపక్ష హోదా అడిగిన జగన్ను ఉద్దేశించి, అసెంబ్లీ వేదికగా అయ్యన్న నీతులు అబ్బబ్బా ఆయనకే చెల్లిందని అనిపించారు.
మరీ ముఖ్యంగా స్పీకర్ పదవిలో అయ్యన్నపాత్రుడు అసౌకర్యంగా ఉన్నారు. మంత్రి పదవిని ఆయన కోరుకుంటున్నారు. అందుకే సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడైన మంత్రి లోకేశ్ గుడ్ లుక్స్లో పడేందుకు అయ్యన్నపాత్రుడు ఎన్నెన్నో తిప్పలు పడుతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కూటమి అధికారంలో ఉన్న ఈ సమయంలో కీలక మంత్రిత్వ శాఖను ఆశిస్తున్న అయ్యన్న, దాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగమే స్పీకర్ చైర్ మీద నుంచి జగన్పై ఘాటు విమర్శలనే చర్చ జరుగుతోంది.
అలాగే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఒంటికాలి మీద లేస్తుంటారు. అతగాడు, పులివెందుల ఎమ్మెల్యే, సైకో తదితర కామెంట్స్ అనిత నుంచి యథేచ్ఛగా వస్తుంటాయి. అనిత తీరుపై కూడా జగన్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు.
ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న, హోంశాఖ మంత్రి అనితకు షాక్ ఇచ్చేలా జగన్ ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మెడికల్ కాలేజీ సందర్శన మరెక్కడైనా పెట్టుకుని ఉండొచ్చు. అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు, అనితకు దిమ్మతిరిగేలా ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టాలని జగన్ పట్టుదలతో ఉన్నారని సమాచారం.
ఇందులో భాగంగానే ఈ నెల 9న విశాఖ జిల్లా పర్యటనకు జగన్ వెళ్లనున్నారు. ఇవాళ విశాఖలో జగన్ పర్యటన విజయవంతానికి నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక కామెంట్స్ చేశారు. ఏడు నియోజకవర్గాల మీదుగా వైఎస్ జగన్ రోడ్ షో వుంటుందని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఈ పర్యటనలో స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ బాధితులు వైఎస్ జగన్ను కలవనున్నట్టు అమర్నాథ్ తెలిపారు.
అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పరిశ్రమను మత్స్యకారులు తీవ్ర వ్యతిరేకిస్తూ ఇటీవల అనితను రోడ్డుపై నిలదీసిన సంగతి తెలిసిందే. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి సర్కార్ వెన్నుపోటు పొడిచిందని కార్మికులు
మండిపడుతున్నారు. వీళ్లందరిని జగన్ కలుస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సహజంగానే జగన్ పర్యటన అంటేనే... జనం వెల్లువెత్తుతుంటారు.
అలాంటిది కొంతకాలంగా ఉత్తరాంధ్రలో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా మన్యంలో గిరిజన విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆస్పత్రిపాలు కావడం తీవ్ర విమర్శకు దారి తీసింది. అలాగే విశాఖ నగరంలో తోపుడు బండ్ల వ్యాపారుల్ని ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. ఇవన్నీ కూడా జగన్ పర్యటనను విజయవంతం చేయడానికి దోహదం చేస్తాయి. మరీ ముఖ్యంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ పర్యటన… కూటమి నేతల్లో తప్పక భయం పుట్టించనుంది. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని సందర్శించి, స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఎలా కౌంటర్ ఇస్తారో అనే చర్చ జరుగుతోంది. కేవలం జగన్పై అవాకులు చెవాకులు పేలడం వల్లే కూటమి చేజేతులా సమస్యల్ని కొని తెచ్చుకుంటోందనే వాదన బలపడుతోంది.
